జైమిని
మహర్షి వేదాలకు పూర్వభాగాలను తీసుకొని
కర్మ కాండ ఆధారంగా పూర్వ మీమాంసా సూత్రాలను రచిస్తే, బాదరాయణుడు వేదాలలో చివరి భాగాలను తీసుకొని
పైకి పరస్పరము విరుద్ధంగా కనిపించే వేద వాక్యాలకు / ఉపనిషత్వాక్యాలకు బ్రహ్మానికి
సంబంధించినవిగా “బ్రహ్మ సూత్రాలు”
రచించడం జరిగింది. కాల
క్రమేణా ఈ బ్రహ్మ సూత్రాలకు పలువురు భాష్య కారులు , భాష్యాలను వ్రాశారు. భారతీయ తత్వ జ్ఞానానికి శాస్త్రీయతా దృక్పధమంతా
ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు,
భగవద్గీత అనే ఈ మూడిటి
ఆధారంగా గుర్తించబడుతోంది. ఈ మూడిటిని ప్రస్థాన త్రయం అని పిలుస్తారు. బ్రహ్మసూత్రాలు
ముఖ్యంగా బ్రహ్మమును అన్నివైపులనుంచీ
విచారించడం ఇందులో విషయం. దీన్ని ఉత్తర మీమాంసా సూత్రాలనీ , శరీరంతో ఉన్న జీవుని యదార్ధ స్వరూపాన్ని
చర్చిస్తుంది కాబట్టి శారీరకమీమాంస అనీ
అంటారు .
బాదరాయణుడు
రచించిన సూత్రాలకు శ్రీ శంకర భగవత్పాదులు శారీరక మీమాంసా భాష్యం వ్రాసా రు.
వేదాంతం అంటే అద్వైత వేదాంతం అనే ప్రచారంలోకి వచ్చింది. బ్రహ్మ సూత్రాలు నాల్గు
అధ్యాలుగా ఉంది. ప్రతి అధ్యాయమూ నాలుగు పాదాలుగాను, ఒక్కొక్క పాదమూ కొన్ని అధికరణాలుగ, ఒకో అధికరణము కొన్ని సూత్రాలతోను ఉంది.
మొదటి అధ్యాయంలో 134 సూత్రాలు 39 అధికరణాలు సమన్వయాధ్యాయంగా చెప్పబడింది .
ఉపనిషత్తులలో చెప్పబడిన వాక్యాలకు బ్రహ్మం తో సమన్వయం చెప్పబడింది. ఆత్మయే
బ్రహ్మమనీ , సృష్టి స్థితి
లయాలకు కారణమనీ ఆనందమయుడని , అన్నీటి యందు
ఉండే పురుషుడు బ్రహ్మమే ననీ, బ్రహ్మమే
జగత్తునకు నిమిత్త ఉపాదాన కారణమని సమన్వయం చెప్పబడింది.
రెండవ అధ్యాయంలో 157
సూత్రాలు 47 అధికరణాలుగ అవిరోధాధ్యాయం ఉంది. దీన్లో వేదాంత
వాక్యాలకు సృష్ట్యాది విషయాలలో ఎట్టి
విరోధమూ లేదనేది చెప్పబడింది. ఇలా
చెప్పడానికి బాదరాయణుని కాలంలో ప్రముఖంగా ఉండే అన్ని మతాలను ఖండిస్తూ తన వాదాన్ని
స్థాపించడం జరిగింది.
మూడవదైన
సాధనాధ్యాయంలో 186 సూత్రాలు 67 అధికరణాలుగ పొందు పరచబడింది. దీన్లో వివిధ
ఆశ్రమ ధర్మాలను , స్వప్నాలను,
జీవుడు వివిధ శరీరాలను
పొందటాన్ని కర్మానుభవాన్ని విద్యలను గురించి ఇలాంటి కొన్ని విషయాలు విశదీకరించ బడ్డాయి.
నాల్గవదైన
ఫలాధ్యాయంలో 78
సూత్రాలు, 38 అధికరణాలు ఉన్నాయి. దీన్లో జీవుడు మరణాంతరం
బ్రహ్మలోకం చేరే మార్గాలను చెప్పడం జరిగింది. చివరగా బ్రహ్మలోకాన్ని పొందిన జీవుడు
తిరిగి సంసారంలోకి రాడు ఆని శ్రుతులు అలా చెప్పబడటం చేత రాడు అని చెప్పబడింది.
బాదరాయణుడు శ్రుతినే ప్రమాణంగా తీసుకొని ఈ
బ్రహ్మసూత్రాలను రచించేడు. బ్రహ్మమే ఈ
ప్రపంచానికి మూలకారణం అని శృతి చెబుతోంది. జగత్తుకు బ్రహ్మమే నిమిత్తకారణము
, ఉపాదాన కారణము కూడ. బాహ్య
విషయాల సహాయం/అవుసరం లేకుండా బ్రహ్మమే
దృశ్య జగత్తుగా పాలనుండి ఇతరపదార్దాలు ఏర్పడినట్లు తనంత రూపు దాల్చడం జరిగింది.
అలాగే సంకల్పం చేత ఆకాశము, వాయువు
మొదలైనవి ఏర్పడ్డాయి . బ్రహ్మమే ఈ
ప్రపంచంగా రూపు దిద్దుకొనడం వల్ల జగత్తు బ్రహ్మము కన్నా వేరైనది కాదు. జీవుల
కర్మలననుసరించే సృష్టి జరుగుతోంది. అంతేకాని పక్షపాత బుద్ధిని బ్రహ్మమునకు
చెప్పటం సరి కాదు. ఆత్మ నిత్యము, అణు పరిమాణం గలది. జీవ బ్రహ్మముల సంబంధం అధ్యాస
వల్ల ఏర్పడినది. అధ్యాస అనే అవిద్య తొలగితే మోక్షం వస్తుంది.
No comments:
Post a Comment