Thursday, June 7, 2012

సాంఖ్య దర్శనం (1) ఆస్తిక దర్శనం

సాంఖ్యదర్శనానికి మూలపురుషుడు కపిల ముని. సంఖ్యఅనే పదంనుంచే సాంఖ్యఅనేపేరు వచ్చిందంటారు.
కపిల ముని  సాంఖ్యతత్వానికి  మూలపురుషుడైనా , నాల్గవ శతాబ్దంలో ఈశ్వరకృష్ణ చే  వ్రాయబడిన సాంఖ్య కారిక - ఈ దర్శనానికి ఆధారమయ్యింది. కపిలుడు మనువు సంతతి వాడు. బ్రహ్మకు మనుమడు , సాక్షాత్ విష్ణువు అవతారమని భగవద్ గీతలో చెప్పబడినది.

సాంఖ్యులు ప్రత్యక్షం, అనుమానం, శబ్దం అనే మూడు ప్రమాణాలని అంగీకరిస్తారు. ఈ ప్రమాణాల చేత, వీరు ప్రకృతినీ  పురుషులను(జీవుడు) మాత్రమే నిత్యాలుగా గ్రహిస్తారు. 
ప్రకృతికి సృష్టికి ముందు నుంచీ  ఉనికి ఉంది.  ప్రకృతి జడమైనదైతే పురుషుడు చైతన్య స్వరూపుడు. 
మనస్సు , దేహము, ఇంద్రియాలకన్న భిన్నమైన వాడు. సాక్షిగా లోక వ్యవహారాలన్నిటినీ చూస్తూంటాడు.  ఆది, అంతమూ లేనివాడు.  ప్రకృతికన్నభిన్నమైన వాడు.  ఏ గుణ విశేషాలూ లేనివాడు.  శుద్ధ స్ఫటికంలా నిర్మల మైనవాడు. స్ఫటికం ముందు ఏ వస్తువు౦చినా దాన్ని ప్రతిబింబి౦ప చేస్తుంది. అలాగే పురుషుడూ నిర్మలుడవడం వల్ల తనముందు ఉండే వస్తువులను ప్రతిబింబింప జేస్తాడు. ప్రకృతి ప్రపంచ వ్యవహారాలు నడుపుతుంటే జీవుడు భోక్తగా అనుభవిస్తూంటాడు. కాని కర్తృత్వం  లేదు.

ఈ జగత్తు యొక్క  సృష్టికి,  ప్రకృతి మూలకారణం. అంచేత దీన్ని మూలప్రకృతి అనీ, ప్రధానం అనీ అనడం జరుగుతోంది. వీరిది  సత్కార్య వాదం . దీన్లో విషయం - శూన్యంనుంచి ఏదీ నిర్మితమవ్వదు. కార్యానికి ముందే అది కారణంలో ఉంటుంది. ప్రతీ విషయమూ  సుఖము, దుఃఖము, నిర్లిప్తతలతో కలసి ఉంటుందనీ, దానికి సత్త్వ,రజస్,తమో గుణాలే కారణంగా చెబుతారు. 

ప్రకృతి సత్వ ,రజస్,తమో గుణాలతో కూడి ఉంటుంది. ఈమూడూ సామ్యావస్థలో ఉన్నపుడు సృష్టి ఉండక స్థిరంగా ఉంటుంది. కర్మానుసారంగా పురుషునికి ఈ ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది. అపుడు  సత్వరజస్తమో గుణాలు వాటి సామ్యావస్థను కోల్పోయి ప్రకృతి  సృష్టికి సన్నద్ధం అవుతుంది. ముందుగా ప్రధానం నుంచి ఈ మూడు గుణాలు పరస్పరము విశిష్టంగా  కలియడం వల్ల మహత్తు / మహత్తత్వం  పుడుతుంది. పురుషుని చైతన్యం జగదుత్పత్తికి బీజమైన మహత్తులో ప్రతిబింబం చెంది చేతనంలా ప్రకాశిస్తుంది. స్వయంగా ప్రకృతి జడమవడం వల్ల అది ప్రకాశవంతం కాదు. పురుషుని వల్లనే అది ప్రకాశవంత మవుతుంది. దాన్ని బుద్ది తత్త్వం అంటారు. ఇది అహంకారంగా మారి నేను, నాది  అనే అభిమానానికి కారణం అవుతుంది. దీనితో (అహంకారంతో) సంబంధపడటం వల్ల పురుషుడు తనే కర్త అనుకుంటాడు. కాని వాస్తవానికి ముందు చెప్పుకున్నట్లు పురుషునికి  భోక్తృత్వమే గాని కర్తృత్వం లేదు.





No comments:

Post a Comment