ఆత్మలు అనేకం
విడివిడిగా ఉంటాయి. అలాగే ఉపాధి
భేదాన్నిబట్టి జీవులు/పురుషులూ అనేకులు ఉంటారు. సృష్టించబడిన జగత్తూ, పురుషుడూ
త్రిగుణాల చేతనే
ముడివేయబడుతున్నారు . ప్రకృతికి కారణం లేదు. అదే విషయాలకు కారణమవుతోంది.
ఈ ప్రకృతి విషయాలు అనుభవించడానికి ఉండే
తెలివిగల వాడు-పురుషుడు/జీవుడు. కనబడే
జగత్తు / విషయాలు - తెలుసుకోవలసినవి . అదే
ప్రకృతి. పురుషుని ప్రేరణ వల్లనే అది క్రమాభి వృద్ది చెందుతూ వికసిస్తుంది.
అహంకారం యొక్క
పనులన్నిటినీ మనస్సు కర్మేంద్రియాలద్వారా
జరుపుతుంది. నేను అని అహంకరించే జీవుడికీ, ఇంద్రియాలకూ మధ్య వారధి బుద్ది. ఇంద్రియాలనుంచి తెచ్చిన విషయాలను మనస్సు
బుద్ధి ముందు ఉంచితే ; బుద్ధి ఆ ప్రకృతి
సంబంధమైన విషయాలను పురుషునిముందు ఉంచుతుంది. బుద్ధికి ఈ విషయాలకూ, పురుషునికీ మధ్య ఉండే తారతమ్యాన్ని విచక్షణ
చేయ్యగలదు. ఇలాంటి విచక్షణా జ్ఞానం పురుషుని చైతన్యం వల్లనే కల్గుతుంది . అంచేతనే
బుద్ధికి నిజంగా విచక్షణా జ్ఞానం లేకపోయినా పురుషుని చైతన్యం వల్లనే ఆ విచక్షణా
జ్ఞానం ఉన్నట్లు కనబడుతోంది. ఇలా ప్రకృతి,
ప్రకృతి విషయమైన బుద్ది
పురుషుని చైతన్యం తో ప్రకాశిస్తున్నాయి.
ఇలా ప్రకృతి విషయాలతో తాదాత్మ్యం చెందటం వల్ల జీవుడు అవిద్యచేత కప్పబడినవాడై ప్రకృతి, పురుషుల వివక్షత కోల్పోవడం జరుగుతుంది.
ప్రకృతియొక్క ఉత్పత్తి
విషయాలనూ , వస్తువులనూ
అనుభవం పొందడానికి కావలసిన బుద్ధి- చైతన్యం, పురుషునిలోనే ఉంది. ఈ త్రిగుణాల తోనున్న
విషయాలు, శరీరము, ఇంద్రియాలు,మనస్సు నేను అనుకునే వాని అనుభవానికే. పురుషుడు
త్రిగుణా తీతుడు, అన్ని విషయాలకూ
సాక్షి. ప్రకృతి, పురుషుడు
విభిన్నమైన వారు. ప్రకృతికి - చైతన్యం
లేదు. జడమైనది , త్రిగుణాత్మక
మైనది , మార్పు చెందేది ,
సృష్టి కార్యంలో చురుకుగా
పాల్గొనేది , బాహ్యంగా కనబడేది,
తెలియబడేది. పురుషుడు -
చైతన్యం గలవాడు, నిర్గుణుడు,
మార్పు లేనివాడు ,
అకర్త , సాక్షి మాత్రుడు , తెలుసుకొనేవాడు.
నిజానికి జీవుడికి
బంధం లేదు. ప్రకృతికే జీవులతో బంధం. పురుషుడు మంచీ చెడుల విచక్షణ లేక సుఖ
దుఖానుభవాలకు లోనవుతూ ; సంసార
బంధాన్నుంచి బయట పడటానికి తప్పనిసరిగా
ప్రకృతితో సంబంధ పడతాడు. ప్రకృతి కూడా అనుభవించతగే విషయాలను జగత్తులో
సృష్టించి , అనుభ వించేవాడి
కోసం ఎదురు చూస్తుంది. ఇలా ప్రధానం పురుషుని రూపంలో అనుభవించే వాడికోసం ఎదురు
చూస్తుంటే; పురుషుడు బంధ
విముక్తికోసం తపిస్తాడు.పరస్పరమూ ప్రధానానికీ, పురుషునికీ ఆశలు ఉండటం వల్ల ఒకరికొకరు ఎదురు
చూస్తుంటారు. పురుషుడు ఆకర్త అవడంవల్ల కుంటి వాని గాను, ప్రకృతి అచేతనమవడం వల్ల గుడ్డివానిగాను
పరిగణిస్తూ; సాంఖ్యులు ప్రకృతి పురుషుల సంబంధం ఏర్పడటానికి కారణంగా ఒక
చిన్న కధ చెబుతారు.
కొంతమంది కలసి ఒక
యాత్రకు బయలుదేరి వెడతారు. వారిలో ఒక కుంటివాడు, ఒక గ్రుడ్డివాడు కూడా యాత్రలో ప్రయాణం
సాగిస్తున్నారు. మార్గమధ్యంలో అనుకోకుండా జరిగిన ప్రకృతి వైపరీత్యం వల్ల, ఎవరికి వారు చెదురుమదురై పోయారు. అలా
కొన్ని రోజుల తర్వాత అదృష్టం కొద్దీ ఆ కుంటివాడూ, గ్రుడ్డివాడూ కలవడం సంభవిస్తుంది. కుంటివాడు
నడవలేక, గ్రుడ్డివాడు
చూడలేక సహాయంకోసం ఆతురుతగా ఎదురు చూస్తుంటారు. అపుడు వీరు ఒకరికొకరు కలుసుకోడంతో
వారిలో ఆశలు చిగురిస్తాయి. అలా గమ్యం చేరడానికి గుడ్డివాడిని తన భుజాలపై కూర్చుండ
బెట్టుకొని ; కుంటతను
మార్గాన్ని చెబుతుంటే , గ్రుడ్డి వాడు ఆ
మార్గ దర్శకాలను గ్రహించి, నెమ్మదిగా గమ్యం
చేరుకుంటారు. అదే విధంగా ప్రకృతిని గ్రుడ్డిగాను, ఆకర్త అయిన పురుషుని కుంటి వానిగానూ ఉదాహరిస్తూ
; వారి గమ్యం చేరుకోడానికి
ఒకరి అవుసరం మరొకరికి ఉంది. సాంఖ్యులు సృష్టికి కారణాన్ని ఇలా సమర్ధిస్తారు.
ఇలాంటి పరస్పర సంబంధం చేత సృష్టి కొనసాగుతుంది- ఉదాహరించబడిన కుంటి గ్రుడ్డి వాళ్ళ
లాగున.
పురుష సంబంధం చేత
ప్రధానం ఉద్ధరించ బడుతుండగా , ప్రధానం యొక్క సంబంధం
వల్ల జ్ఞ్ఞానం ద్వారా పురుషుడూ మోక్షం పొంద గల్గు తున్నాడు . నాట్యకత్తె రంగస్థలం
పై నాట్యం చేసి అందరినీ అలరించి తెర వెనుకకుపోయి ఎలా మరుగై పోతుందో ; అలా ప్రకృతి కూడా పురుషునికి తనను ప్రదర్శించు
కొంటుంది . తన సోయగాలన్నీ పురుషుడు చూశాడనే ఎరుక ఎపుడు కల్గుతుందో , ఆపుడిక పురుషుడి ముందు ఏ ప్రదర్శనా తిరిగి
చెయ్యదు. సత్యం తెలిసిన పురుషుని ప్రకృతి
ఏవిధంగాను మోహింప చేయలేదు.
లింగ శరీరం
/సూక్ష్మ శరీరం అనేది ఒక భౌతిక దేహాన్నుంచి మరొక దేహానికి జన్మ పరంపరలలో
కొనసాగేది. గడచిన జన్మలలో చేసుకున్న కర్మల ముద్రలు సూక్ష్మ శరీరంలో గుర్తుగా నిబిడీకృతం అయివుంటాయి. లింగ శరీరం భౌతిక
దేహంతో ఉంటె జన్మ. విడిపోతే మరణం. పురుషుడిని
తెలుసుకుంటే లింగ శరీరం పతనమవుతుంది. జీవుడు ప్రకృతిని తెలుసుకొని కైవల్యం
పొందుతాడు. సృష్టి లయమవడంలో అన్నీ
ప్రకృతిలోనే లయమై పోతాయి. ప్రతీది కారణంలో కలిసిపోతుంది. నీరు అగ్నిలోను, అగ్ని వాయువందూ, వాయువు ఆకాశమందూ, ఆకాశం అహంకారంలోను, అహంకారం మహత్తు లోనూ , మహత్తు ప్రధానం లోనూ లీనం అవుతాయి. ఇలా సృష్టి,
స్థితి, లయాలకు ఆది అంతమూ అనేవి లేవు.
పురుషుడిని
ప్రకృతి బంధాలనుంచి విడిపించడమే సాంఖ్యసిద్ధాంతం. ఇరవైనాలుగు సత్యాలనూ పూర్తిగా
తెలుసుకొని; పురుషుడు వాటితో
బద్ధుడు కాడు అనే జ్ఞానం వల్ల అది మోక్షం
కల్గిస్తుంది . ఆత్మ బద్ధుడు కాదు. స్వతంత్రుడూ కాదు. జనన మరణ చక్రంలో బంధింప బడనూ
లేదు. ప్రకృతియే జనన మరణాలను పొందేది. ప్రకృతి యొక్క చేష్టలన్నీ ఆత్మను లేక పురుషుని
బంధవిముక్తుడిని చెయ్యడంకోసమే. ప్రకృతి క్రియలన్నీ అత్మానుభావానికే. ప్రకృతి జీవుని చెయ్యి పట్టుకొని ప్రపంచాన్ని
చూపిస్తుంది. అందలి విషయాలన్నిటినీ అనుభవింప జేస్తుంది. చివరకు జీవుడిని బంధం
నుంచి, విడివడటానికి
దోహదం చేస్తుంది.
సాంఖ్యులు
ప్రత్యక్ష, అనుమానాది
ప్రమాణాల వల్ల ఉన్న వస్తువును తెలుసుకోవచ్చు అంటారు. అనుమానా ప్రమాణం చేత
కార్యాన్ని బట్టి కారణం ఊహిస్తారు. సాంఖ్యులు పుట్టడానికీ, మోక్షానికీ భగవంతుడు అవసరం లేదనీ ,పురుషుడు తన కర్మ ఫలాలచేతనే పరిపక్వమైనపుడు
మోక్షం పొందుతాడని అంటారు. న్యాయ, వైషేశికుల లాగానే
, సాంఖ్యులు పదార్ధం యొక్క
శాశ్వత ఉనికిని అంగీకరిస్తారు . కాని వీరిది సత్కార్య వాదం. సత్యమైనది అసత్యమైన
దాని నుంచి ఆవిర్భ వించదు. అంచేత అసత్యమైనది సత్యమైన దానికి కారణం కాజాలదు. కారణం
నిజమవడంవల్ల , కార్యమూ సత్యమే.
ఇక్కడ కారణం అంటే ఉపాదాన కారణం . సత్యం
నుంచి సత్యమే పుడుతుంది.
నిజానికి ఏదీ
సృష్టించబడలేదు . ఇదివరలో మన అనుభవంలో లేనిది ఇపుడు అనుభవంలోకి వచ్చింది . ఎలాగంటే
ఇపుడు తెర తొలగించ బడినదంతే. తెర తొలగగానే ఆవస్తువు/పదార్ధం కనిపించిందంతే. అలాగే
కార్యం కారణంలో ఇమిడియే ఉంటుంది. తెర
తొలగించ బడిందంతే. కొత్తగా సృష్టించ బడినదేదీ లేదు. అంచేత కారణం లాగానే కార్యమూ సత్యమే. ఈశ్వరుడు ఎపుడూ
బంధం లేనివాడే. సాంఖ్యులు దైవాన్ని నమ్మక పోయినా వేదం యొక్క ప్రమాణాన్ని
అంగీకరిస్తారు. అంచేత వీరిని ఆస్తికులలో చేర్చడం జరిగింది. క్రమంగా ఆస్తిక వాదులూ
సాంఖ్యులలోకి వచ్చారు. వీరిలో
ఆస్తికవాదులు క్రమంగా వచ్చారు. ఈశ్వరత్వాన్ని అంగీకరించే సాంఖ్య దర్శనానికి మూల
పురుషుడు పతంజలి.
No comments:
Post a Comment